రోడ్ల సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలకు సిద్ధం

రోడ్ల సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలకు సిద్ధం

రోడ్ల సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలకు సిద్ధం

– 30న భద్రాచలం ఎమ్మెల్యేతో చర్చలు

వెంకటాపురం, ఆగస్టు28, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో రహదారుల అధ్వాన స్థితి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలకు సిద్ధమవుతున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశానికి బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు వేల్పూరి లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ రహదారి సమస్యపై ఇప్పటికే ఎమ్మెల్యే, మంత్రి సీతక్కతో అనేకసార్లు చర్చించినప్పటికీ పరిష్కారం కాని పరిస్థితి నెలకొన్నదని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈనెల 30వ తేదీన భద్రాచలం ఎమ్మెల్యేతో అఖిలపక్షం తరఫున సమావేశం జరుగుతుందని చెప్పారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గంపా రాంబాబు మాట్లాడుతూ రహదారి సమస్యపై ఎమ్మెల్యే, జిల్లా ఉన్నతాధికారులను కలిసి మెమొరాండం ఇవ్వాలని, ఆ తరువాత ప్రభుత్వం స్పందన బట్టి తదుపరి కార్యాచరణ నిర్ణయించుకోవాలని సూచించారు. తెలుగుదేశం మండల అధ్యక్షుడు తాళ్లూరి లక్ష్మణరావు మాట్లాడుతూ రహదారి సమస్యపై ఇప్పటికే ఆలస్యమైందని, వెంటనే ఆందోళనలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. సీపీఎం మండల కార్యదర్శి గ్యానం వాసు మాట్లాడుతూ రహదారి సమస్యపై నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, మండల బంద్ వంటి ఉద్యమాలు చేపట్టి విజయవంతం చేయాలని ప్రతిపాదించారు. ఈ సమావేశానికి హాజరైన అన్ని పార్టీల నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రహదారి సమస్య పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణను 30వ తేదీన ఎమ్మెల్యేతో చర్చల అనంతరం నిర్ణయిస్తామని, ఈ పోరాటంలో ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ముందుకు సాగుతామని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గార్లపాటి రవి, బీఆర్‌ఎస్ నాయకులు డర్రా దామోదర్, ముడుంబ శీను, తెలుగుదేశం నాయకులు ఆత్మకూరి పట్టాభి, సీపీఎం నాయకులు కుమ్మరి శీను, కట్ల నరసింహ చారి, చిట్టెం ఆదినారాయణ, కొగిల మాణిక్యం, మార్కెట్ కమిటీ సభ్యులు యాలం సాయి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment