మద్యానికి బానిసైన యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య
వెంకటాపురం, జూన్ 21, తెలంగాణ జ్యోతి : మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి, తాగుడుకి డబ్బుల్లేక మనస్తాపానికి లోనై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే… ఎదిర గ్రామానికి చెందిన కారం పవన్ కళ్యాణ్ (26) కొంతకాలంగా మద్యం అలవాటుకు బానిసై ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతున్నాడు. శనివారం మద్యం కొనుగోలు చేయడానికి డబ్బులు కావాలని భార్యతో గొడవపడ్డాడు. ఆమె డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా మనస్తాపానికి లోనై పురుగుమందు తాగాడు. వాంతులు చేయడం ప్రారంభించడంతో కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ఎదిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్టు గుర్తించి వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ పవన్ కళ్యాణ్ మృతిచెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు వెంకటాపురం పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ కే. తిరుపతి రావు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నది.