వెజిటబుల్ మిని కిట్ల పంపిణీతో రైతులకు అదనపు ఆదాయం
ములుగు, మార్చి 26, తెలంగాణ జ్యోతి: జిల్లాలో కూరగాయల సాగును ప్రోత్సహించి రైతులకు అదనపు ఆదాయం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వెజిటబుల్ మిని కిట్లను పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి డి. సంజీవరావు తెలిపారు. ఆసక్తి గల రైతులకు రూ.500 విలువ గల ఐదు రకాల కూరగాయల విత్తనాలతో కూడిన కిట్లు ఉచితంగా అందించబడతాయని ఆయన చెప్పారు. ఒక్క మిని కిట్లో టమోటా, మిర్చి, బెండ, గోరుచిక్కుడు, పాలకూర విత్తనాలు ఉండి, ఇవి సుమారు 20 గుంటల భూమికి సరిపడే విధంగా ఉంటాయని వివరించారు. తక్కువ పెట్టుబడితో, తక్కువ విస్తీర్ణంలోనే మంచి ఆదాయం పొందే అవకాశం రైతులకు ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 625 ఎకరాల్లో కూరగాయల సాగు లక్ష్యంగా 1250 మిని కిట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఆసక్తి గల రైతులు తమ భూమి పట్టాదారు పాసుబుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ సైజు ఫోటోలతో సమీప ఉద్యాన కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుని విత్తనాలను పొందవచ్చని తెలిపారు. వివరాలకు ములుగు ఉద్యాన అధికారి (సెల్: 7780132284) లేదా ఏటూరునాగారం క్లస్టర్ ఉద్యాన అధికారి (సెల్: 7702383263)ను సంప్రదించాలని సూచించారు.








