చిరుతపల్లి ఆశ్రమ బాలికల పాఠశాలలో “అభయ మిత్ర” కార్యక్రమం
– పాల్గొన్న ఎటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ
వెంకటాపురం,తెలంగాణజ్యోతి:ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని చిరుతపల్లి ఆశ్రమ బాలికల పాఠశాలలో సోమవారం “అభయ మిత్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల భద్రత మరియు విద్యార్థుల అభివృద్ధి దృష్ట్యా ములుగు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శివం ఉపాధ్యాయ విద్యార్థులతో మాట్లాడారు. చదువుపై దృష్టి పెట్టాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలు యువత జీవితాలను నాశనం చేస్తాయని, అవి శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతాయని వివరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, ఇతరులకు మార్గదర్శకులుగా నిలవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా, పోక్సో చట్టం పై అవగాహన కల్పిస్తూ, చిన్న వయసులో తెలియక చేసే తప్పులు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరించారు. విద్యార్థులు చట్టాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్కూల్ యాజమాన్యం పిల్లల ప్రవర్తనపై పర్యవేక్షణ కొనసాగిస్తూ వారికి సానుకూల దిశగా మార్గనిర్దేశనం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సీఐ బండారి కుమార్, ఎస్ఐ కె. తిరుపతిరావు, శిక్షణ ఎస్ఐ జి. తిరుపతి, మండల ఎంఏఓ జివివి సత్యనారాయణ, ఆశ్రమ పాఠశాల హెచ్ఎం వై. బాబురావు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ వీక్ సందర్భంగా పాఠశాల ఆవరణలో 60 మొక్కలను నాటి, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు చైతన్యం కల్పించారు. మొక్కల నాటే కార్యక్రమానికి ఏఎస్పీ శివం ఉపాధ్యాయ స్వయంగా నాయకత్వం వహించారు.