తండ్రి ముసుగులో దుర్మార్గుడు.!
– కన్న కూతురిపైనే కన్నేసిన క్రూరుడు
నారాయణపేట, జూలై 27, తెలంగాణ జ్యోతి : తండ్రిగా పుట్టి రాక్షసంగా ప్రవర్తించిన ఓ తండ్రి బారిన పడిన కూతురి పాలిట నరకంగా మారింది. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని పూసలపాడు గ్రామానికి చెందిన కురువ కురుమయ్య తన భార్య శ్యామలమ్మతో కలిసి నివసిస్తున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో శృతి అనే చిన్నారి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతుంది. జూలై 25న పాఠశాల ముగిసిన తర్వాత శృతి ఇంటికి తిరిగి వచ్చిందని, ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న తండ్రి కురుమయ్య బలవంతంగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తల్లి శ్యామలమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఘటన తర్వాత శృతిని స్థానిక ఆర్.ఎం.పీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. కానీ పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు మరికల్ ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత బాలిక తల్లి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్సై రాములు వెల్లడించారు. దోషుడిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.