నాగులపంచమి రోజు వింత ఆచారం.. తేళ్లతో ఆటలా..!
నారాయణపేట, జూలై 19, తెలంగాణజ్యోతి : సంవత్సరంలో ఒక్కరోజు ప్రత్యేకంగా జరిగే నాగులపంచమి పండుగను పురాణాల ప్రకారం ప్రజలు జరుపుకోవడం నారాయణపేట జిల్లా సమీపంలోని కందుకూరులో శతాబ్దాలుగా ఒక వింత ఆచారం కొనసాగుతోంది. ప్రతిఏడాది నాగులపంచమి రోజున గ్రామస్తులు పుట్టల వద్ద పాలు పోసి నాగదేవతలను ఆరాధిస్తారు. అయితే, కందుకూరు గ్రామంలో మాత్రం ఈ పండుగను విభిన్నంగా నిర్వహిస్తారు. ఇక్కడ తేళ్ల దేవత విగ్రహానికి పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించు కుంటారు. అంతటితో ఆగకుండా, పిల్లల నుంచి పెద్దలవరకు తేళ్లను చేతులతో పట్టుకుని ఆటలాడడం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ తేళ్ల ఆచారాన్ని చూసి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. తేళ్లతో భయ పడకుండా భక్తిగా చేతుల్లో తీసుకొని ఆడుకునే కందుకూరు గ్రామ ప్రజల నమ్మకం, ధైర్యం ఎంతో ప్రత్యేకమైందని ఆలయ పూజారి వెల్లడించారు.