ములుగులో పబ్లిక్ గార్డెన్, మినీ స్టేడియం ఏర్పాటు చేయాలి
ములుగు, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా కేంద్రంలో పబ్లిక్ గార్డెన్‌తో పాటు మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని సామాజిక విశ్లేషకులు కుమార్ పాడ్య కోరారు. నగర పంచాయతీగా అభివృద్ధి చెందిన ములుగులో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, వాకింగ్, వినోదం కోసం ప్రత్యేక స్థలం అవసరమని తెలిపారు. ప్రతి రోజు వాకింగ్ చేసే ప్రజలు, ఉద్యోగులు, చిన్నపిల్లలు, యువత కోసం పబ్లిక్ గార్డెన్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మినీ స్టేడియం ఏర్పాటు ద్వారా యువత క్రీడల వైపు మళ్లి చెడు అలవాట్లకు దూరమవుతారని, క్రీడల్లో ప్రతిభ చూపే వారికి జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కనీసం మూడు ఎకరాల్లో ఈ వసతులు ఏర్పాటు చేసి పిల్లలకు ఆట పరికరాలు, పచ్చని వాతావరణం, యోగ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.






