ములుగు అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రజా ప్రభుత్వం
ప్రజా దర్బార్లో సమస్యలు స్వీకరించిన మంత్రి సీతక్క
వెంకటాపురం, ఏప్రిల్ 10, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని రాష్ట్ర మంత్రి సీతక్క స్పష్టం చేశారు. శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించగా, వెంకటాపురం, వాజేడు, మంగపేట, కన్నాయిగూడెం, ఏటూరు నాగారం మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవిస్తూ దరఖాస్తులు సమర్పించారు. మంత్రి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ వేదికగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా భూ సమస్యలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, పింఛన్లు, మౌలిక వసతులపై ఎక్కువగా అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆలస్యం లేకుండా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, గుత్తేదారులు మరియు అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని మంత్రి హెచ్చరించారు. రాబోయే మూడు నెలలు పనులు పూర్తి చేసేందుకు అనుకూల సమయమని పేర్కొన్నారు. స్థానిక స్థాయిలోనే ప్రజా దర్బార్, ప్రజావాణి కార్యక్రమాల ద్వారా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. మాట్లాడుతూ ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి అర్జీకి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కారం చూపుతామని తెలిపారు. అనంతరం మంత్రి సీతక్క వెంకటాపురం మండలంలోని పాలెం వద్ద పాత్రపురం గ్రామానికి రూ.90 లక్షల నిధులతో చేపట్టనున్న రహదారి పనులకు శంకుస్థాపన చేయగా, అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా ఉపాధి హామీ పథకం కింద రూ.20 లక్షలతో పడాల రమేష్ ఇంటి నుండి పాత మార్కెట్ రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ములుగు జిల్లా అడవులతో కూడిన ప్రాంతం కావడంతో రవాణా సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. ఉపాధి హామీ నిధులతో రెండు మండలాలకు కలిపి దాదాపు రూ.10 కోట్లను కేటాయించామని, ఐటిడిఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలకు సుమారు 4,500 ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సూచనల మేరకు జిల్లాలో మరిన్ని రోడ్లు, వంతెనలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మనన్ భట్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, మాజీ ఎమ్మెల్సీ బలసాని లక్ష్మీనారాయణ, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత మండల అధికారులు పాల్గొన్నారు.










