Mulugu బీఆర్ఎస్ లో నయా జోష్.. కారెక్కిన జిల్లా లీడర్లు…
-రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ సింగ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకన్న
– మంత్రి కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్ లో చేరిక
-టీడీపీ క్యాడర్ బీఆర్ఎన్ కు బలమంటున్న నేతలు
ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో నయా జోష్ కనిపిస్తోంది. బలమైన నాయకులు చేరుతుండటంతో పార్టీ బలం పెంచే పనిలో నేతలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా రెండేళ్లు గా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించుకొని నిత్యం ప్రజల్లో తిరుగుతూ విద్యార్థులకు నోటు పుస్తకాలు, విద్యోపకరణాలు పంపిణీ చేసిన రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ భూక్య దేవ్ సింగ్ ఆదివారం హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు ఈర్ల వెంకన్న ఆలియాస్ కోళ్ల వెంకన్న సైతం బీఆర్ఎన్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం ఎ మ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి బీ ఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరగా.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ములుగు జిల్లా ప్రజలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యధిక ప్రేమ ఉందని, అందుకే 2018లో అభ్యర్థి ఓడినా ములుగును జిల్లాగా చేసి అభివృద్ధి చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతి గెలుపుకు కృషి చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం: రిటైర్డ్ కమిషనర్ దేవ్ సింగ్ , కోళ్ల వెంకన్న
బీఆర్ఎస్ నేతృత్వంలోనే ములుగు జిల్లా అభివృద్ధి సాధ్యమని, గతంలో మంత్రి చందూలాల్ హయాంలో జరిగిన అభివృద్ధి తరువాత మళ్లీ కేసీఆర్ చొరవతోనే ములుగు జిల్లా గా ఏర్పడి ఇక్కడి ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తోందని దేవ్ సింగ్, కోళ్ల వెంకన్న స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలకు సేవచేయాలనే సంకల్పంతోనే బీ ఆర్ఎస్ లో చేరినట్లు వారు ప్రకటించారు. అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపు ఖాయమని, అందుకు సర్వశక్తులా కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా గెలిచేది బీఆర్ఎస్ అని గెలిపించేది అభివృద్ధి సంక్షేమ పథకాలేనని వెల్లడించారు. ములుగు నియోజకవర్గంలో 25వేల మెజారిటీతో బీఆర్ఎస్ తప్పక గెలుస్తుందని. అన్నారు.
– బీఆర్ఎస్ క్యాడర్ లో జోష్..
ములుగుకు చెందిన బలమైన నాయకులు బీఆర్ఎస్ లో చేరడంతో పార్టీ క్యాడర్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. భూక్య దేవ్ సింగ్ గత రెండేళ్లుగా నియోజకవర్గంలో తిరుగుతూ విద్యార్థులకు స్టడీమెటీరియల్ పంపిణీ చేశారు. అదేవిధంగా పాఠశాలల బలోపేతానికి తనవంతు సాయం అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై బీ ఆర్ఎస్ లో చేరారు. ములుగు నియోజకవర్గంలో బంజారా సామాజిక వర్గం సుమారు 34 వేల మంది ఓటర్లు ఉండగా దేవ్ సింగ్ ప్రభావితం చేయనున్నారు. అదేవిధంగా కోళ్ల వెంకన్న గా సుపరిచితుడైన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఈర్ల వెంకన్న వ్యాపార వేత్తగా, ములుగులో స్థిరపడ్డారు. 2009 నుంచి 2014వరకు కాంగ్రెస్ పార్టీలో పని చేసిన ఆయన 2014లో టీఆర్ఎస్ లో చేరారు. 2018లో మంత్రి చందూలాల్ సమక్షంలో ములుగు, సర్పంచ్ గా పోటీకి సిద్ధమయ్యారు. తదనంతర పరిణామాలతో టీడీపీ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతుండగా క్యాడర్ తో కలిసి ఆదివారం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీ ఆర్ఎన్ లోకి వచ్చారు. ఈ ఇద్దరి చేరికతో ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో టీఎస్ రెడ్ కో చైర్మన్ వై సతీష్ రెడ్డి,మాజీ మంత్రి అజ్మీర చందూలాల్ తనయుడు ధరమ్ సింగ్, సీనియర్ నాయకులు పోమా నాయక్, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ రావు , ఓ సి డి ఎం ఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.