భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలి
ఆదివాసీ జెఎసీ డిమాండ్
వెంకటాపురం, ఆగస్టు1, తెలంగాణ జ్యోతి : భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసీ) డిమాండ్ చేసింది. శుక్రవారం వెంకటాపురం మండల కేంద్రంలోని కొమరం భీం విగ్రహం ఆవరణలో నిర్వహించిన జెఎసీ సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ సొంది వీరయ్య మాట్లాడుతూ తెలంగాణ పునర్విభజన కారణంగా మహబూ బాబాద్ లోకసభ నియోజకవర్గం ఆదివాసులకు దూరమైంద న్నారు. బంజారా వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడంతో మహబూ బాబాద్ ఎంపీ స్థానం వారికే పరిమితమైపోయిందని విమర్శించారు. ఆదివాసులు ఇప్పటికీ అన్ని రంగాల్లో వెనుకబడ్డ వారేనని, విద్యారంగంలో వారి పురోగతికి భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల అవసరమని పేర్కొన్నారు. ఇది భవిష్యత్‌లో పోలవరం లాంటి సమస్యల్లో తమ హక్కులను రక్షించు కోవడానికి ఉపయోగపడుతుందన్నారు. డిమాండ్‌ను తేలికగా తీసుకుంటే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి, జిల్లా అధ్యక్షులు పూనెం ప్రతాప్, ఆదివాసి నేతలు ఉయిక శంకర్, కోర్స నరసింహమూర్తి, వాసం నాగరాజు, కుంజ మహేష్, చింత సమ్మయ్య, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.