నాణ్యమైన ఆహారంతోనే మెరుగైన జీవనం
ములుగులో ఈట్ రైట్ వాక్ ను ప్రారంభించిన కలెక్టర్
ములుగు ప్రతినిధి, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: నాణ్యమైన ఆహారం తీసుకోవడం ద్వారానే మెరుగైన జీవనం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ తాము తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. సూచించారు. సోమవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద “ఈట్ రైట్ వాక్”ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ అవగాహన ర్యాలీ ఆసుపత్రి నుంచి డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 11 వరకు ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంపై దాదాపు 90 శాతం ప్రభావం చూపుతుందని, మంచి ఆహారం ద్వారా ఉత్తమ ఆరోగ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పనిబారంతో ప్రజలు బయట లభించే అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల చిన్న వయస్సులోనే క్యాన్సర్, గుండెపోటు వంటి ప్రమాదకర వ్యాధులు పెరుగుతున్నాయని హెచ్చరించారు. అందువల్ల జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండి తాజా కూరగాయలు, ఇంటి వంటలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. తినుబండారాలు, భోజనశాలలు నిర్వహించే వారు నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ముడి సరుకుల నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జి, డీఎంహెచ్‌ఓ గోపాలరావు, డీసీహెచ్ జగదీశ్వర్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీపీఓ వెంకయ్య, సీహెచ్‌సీ వైద్యాధికారి సురేష్, మున్సిపల్ కమిషనర్ రమేష్, మహిళా సంఘాల సభ్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.









