తాగునీటి సరఫరాపై ఫిర్యాదు వస్తే విధుల నుండి తొలగింపు
– కాటారం, మహాదేవ పూర్ మండలాల్లో కలెక్టర్ భవేష్ మిశ్రా ఇంటింటి సందర్శన
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: వచ్చే వారం రోజుల్లో ప్రతి ఇంటికి సరిపోను మంచినీరు అందించాలనీ, ప్రజలనుండి ఫిర్యాదులు అందితే తక్షణమే విధుల నుండి తొలగింపు చర్యలు చేపడుతామని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తాగునీటి సరఫరాపై అధికారులకు ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లాలోని కాటారం, మహాదేవపూర్ మండలాల్లో సంబంధిత అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా కాటారం మండల కేంద్రంలోని అయ్యప్ప కాలనీ సందర్శించి స్వయంగా ఇంటింటికి వెల్లి మంచినీరు సరఫరాపై గృహిణిలను అడిగి తెలుసుకున్నారు. ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యుల సంఖ్య, నీటి వినియోగం పై ఆరా తీశారు. కార్యక్రమంలో నీటి సరఫరా సక్రమంగా అందడం లేదని, అరకొర మంచినీటి సరఫరాతో ఇబ్బంది అవుతుందని కొంత మంది ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ స్థానిక తాశీల్దార్ కార్యాలయంలో సంబంధిత ఎంపిడిఓ, ఆర్ డబ్ల్యూ యస్, గ్రిడ్ ఏ ఈ లు, పంచాయతీ సెక్రెటరీలతో కలెక్టర్ మిశ్రా సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వారం రోజుల్లోగా ఇంటింటి సర్వే నిర్వహించి, త్రాగునీరు సమస్య తలెత్తకుండా మండల కేంద్రంలోని ప్రజలకు సరిపోను నీరు అందించాలని, నీటి సరఫరా సమయంలో ఎవరైనా మోటార్లు బిగించి నీటి విసియోగానికి పాల్పడితే, వారికి నోటీసు జారీ చేసి తగు చర్యలు తీసుకొని మోటర్లను సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఇందుకనుగుణంగా సంబంధిత అధికారులు ఈ వేసవి నీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా విదుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని, అలాగే ఈ వారం రోజుల్లో మరోసారి సందర్శించినప్పుడు మంచినీటి సరఫరాపై ప్రజలు ఫిర్యాదులు వస్తే వెంటనే విధుల నుండి తొలగిస్తామని జిల్లా కలెక్టర్ కాటారం లోని సంబంధిత అధికారులను హెచ్చరించారు. అనంతరం మహాదేవపూర్ మండల కేంద్రంలోని దుబ్బ గూడెం, కాలనీ మండలంలోని బొమ్మాపూర్ లోని ఎస్సీ కాలనీ, రాపెల్లి కోట గ్రామాలను సందర్శించి నీటి సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. రాపెల్లి కోట లో మంచి నీటి ఎద్దడి లేదని సకాలంలోనే మాకు మంచి నీరు అందుతుందని ఆ గ్రామ గృహిణిలు కలెక్టర్ కు తెలిపారు. కార్యక్రమంలో మహదేవపూర్ మండల సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఈ మూడు నెలలు మంచినీటి ఎద్దడి లేకుండా పైపు లైన్ లో ఎక్కడ సమస్య ఉన్న సత్వరమే స్పందించి ప్రజలకు మంచినీటి సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం, మహాదేవపూర్, తహశీల్దార్లు, ఎంపిడిఓలు, మిషన్ భగీరధ, గ్రిడ్ ఇంజనీర్లు, పంచాయతీ సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.