అంబేద్కర్ జయంతి వేడుకలకు భారీగా హాజరుకావాలి
ప్రచార రథం ప్రారంభం – గ్రామాల వారీగా అవగాహన
ఉత్సవ కమిటీ చైర్మన్ జన్ను రవి పిలుపు
ములుగు, ఏప్రిల్ 12, తెలంగాణ జ్యోతి: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హాజరుకావాలని అంబేద్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ జన్ను రవి పిలుపునిచ్చారు. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈనెల 14న జరగనున్న జయంతి వేడుకల నేపథ్యంలో ప్రచార రథాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో ప్రచార రథం తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడి అట్టడుగు వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రూపుదిద్దిన మహనీయుడని పేర్కొన్నారు. ఈనెల 14న కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించే జయంతి వేడుకలకు జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ నెమలి నరసయ్య, ఓరుగంటి అనిల్, రొంటాల బిక్షపతి, మాదారపు రాజు, వావిలాల రాజ్‌కుమార్, మరాఠీ రవీందర్, పసుల సాగర్ మహారాజ్, రత్నం రాజేందర్, గడ్డం భద్రయ్య, రత్నం దామోదర్, గుగ్గిళ్ళ సృజన్, మాట్ల సంపత్, కనకం దేవదాస్, నాదెళ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.









