మేడారం జాతరలో గ్యాంగ్ రేప్ జరగలేదు
– అదంతా సోషల్ మీడియా సృష్టే
– జాతీయ మహిళా కమిషన్ ప్రాథమిక నిర్ధారణ
ములుగు, ఫిబ్రవరి5,తెలంగాణజ్యోతి: మేడారం జాతరలో మైనర్ బాలిక పై గ్యాంగ్‌రేప్ జరిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని జాతీయ మహిళా కమిషన్ ఎంక్వయిరీ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ విచారణ కమిటీని ఏర్పాటు చేయగా గురువారం సభ్యురాలు డెలినా, కంచన్ కట్టర్ ఆధ్వర్యంలో బృందం మధ్యాహ్నం ములుగుకు చేరుకుంది. ములుగు కలెక్టరేట్‌లో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ రామ్‌నాథ్ కేకన్‌లతో భేటీ అయ్యారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. సమావేశం అనంతరం మేడారం వెళ్లిన ఎంక్వైరీ కమిటీ సభ్యులు జాతర పరిసరాల్లో ఘటన జరిగిందని ప్రచారం జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. జాతర సమయంలో ఎలాంటి గ్యాంగ్‌రేప్ ఘటన జరగలేదని ప్రాథమికంగా తేల్చిన కమిటీ, పోలీసుల నుంచి లిఖితపూర్వక నివేదిక అందిన తర్వాత తుది నివేదికను జాతీయ మహిళా కమిషన్‌కు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేష్, పస్రా సీఐ దయాకర్, ఎస్సై కమలాకర్ తదితరులు ఉన్నారు.






