కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న గ్యారెంటీనే లేదు : మంత్రి సత్యవతి రాథోడ్
- గెలిచినా కలిసుంటారనే నమ్మకం లేదు
- గిరిజనేతరులకు పట్టాలు ఇప్పించేది బీఆర్ఎస్ పార్టీనే
- లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు
- బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని గెలిపించుకుంటేనే అభివృద్ధి సాధ్యం
- ప్రచారం తప్ప సీతక్క అభివృద్ధి చేసిందేమీ లేదు
- కొత్తగూడ ఓటాయి ఎన్నికల ప్రచారంలో మంత్రి సత్యవతి రాథోడ్
- సీతక్క అత్తగారి ఊరు మొండ్రాయి గూడెం లో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి
- సీతక్కకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నాగజ్యోతి సవాల్
తెలంగాణ జ్యోతి, నవంబర్17, కొత్తగూడ ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ఓట్లు అడుగుతున్నారని, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే గ్యారెంటీనే లేదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా కలిసి ఉంటారనే నమ్మకం గాని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో అనే గ్యారెంటీనే లేదని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే సీతక్క ప్రచార ఆర్భాటం తప్ప ములుగుకు చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల్లో విజయం సాధించగానే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వార గోదావరి జలాలను తెప్పించి గంగారం కొత్తగూడ మండలాలను సస్యశ్యామలం చేస్తానని అన్నారు. కేవలం మూడు గంటల ద్వారా ఎకరం భూమి పారుతుందని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 24 గంటల కరెంటు కావాలా 3 గంటల కరెంటు కావాలో ప్రజలే తేల్చుకోవాలని ఆమె అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, బడే నాగజ్యోతిని గెలిపించి ములుగులో అభివృద్ధి బాటలు వేసుకోవాలని సూచించారు. శుక్రవారం గుడి తండా తిమ్మాపురం గుండం పల్లి గూడెం మోకాళ్ళపల్లి ఎంచగూడెం సాదిరెడ్డిపల్లి పోగుల్లపల్లి తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ 20 ఏళ్లు రాజకీయంలో ఉన్న సీతక్క తన అత్తగారి ఊరైన మొండ్రాయిగూడెం కి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని సవాల్ విసిరారు. పలు రకాల హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతునారని, అసలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని దుయ్యబట్టారు. ఈనెల 30 తేదీన జరిగే ఓటింగ్లో పాల్గొని తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ రెడ్కొ చైర్మన్ వై సతీష్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్ నాయక్, ఓడిసిఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, దివంగత మంత్రి చందులాల్ తనయుడు అజ్మీర ధరంసింగ్, మండల పార్టీ అధ్యక్షులు కొమ్మనబోయిన వేణు తదితరులు పాల్గొన్నారు.