మేడారం మహాజాతర భద్రతే లక్ష్యం : ఎస్పీ
ములుగు జిల్లా పోలీస్ నివేదిక–2025 విడుదల
ములుగు జిల్లా వ్యాప్తంగా 2025లో 2,472 నేర కేసులు
ములుగు జిల్లాలో శాంతిభద్రతలు కంట్రోల్లోనే ఉన్నాయి
మేడారం మహాజాతరకు 11,500 మంది పోలీసు సిబ్బంది విధులు
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాద్ కేకన్
ములుగు ప్రతినిధి, డిసెంబర్31, తెలంగాణ జ్యోతి : ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మల జాతరలో తాము సేవలందించడం తమకు అదృష్టంగా భావిస్తున్నామని, జనవరిలో జరిగే మహాజాతర సక్సెస్ లో పోలీసు శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ స్పష్టం చేశారు. జిల్లాలో సైబర్ నేరాలతోపాటు దొంగతనాలు, ఇతర రికవరీల్లో ఘననీయమైన మార్పు ఉందని, గత ఏడాది కంటే ఈసారి 14శాతం మేర నేరాలు ఎక్కువ నమోదైనా అవి సాధారణమైనవేనని పేర్కొన్నారు. జిల్లాను మావోయిస్టు రహిత జిల్లాగా మార్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరావాస పథకంలో భాగంగా గత ఏడాది 87మంది మావోయిస్టులు లొంగిపోయారని, ఈ ఏడాది అందరినీ జనజీవన స్రవంతిలో కలిసేలా చొరవ తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. బుధవారం ములుగులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ లతో కలిసి మీడియాకు వార్షిక నేర నివేదక వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మేడారం మహాజాతరలో ఈసారి 11500ల మంది వివిధ హోదాలోని అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారని, ట్రాఫిక్ నియంత్రణ, భక్తులు క్షేమంగా దర్శించుకొని ఇళ్లకు చేరడమే పరమావధిగా పనిచేస్తామన్నారు. నేరాలలో గత ఏడాదికి ఈసారి కొంతమేర పెరుగుదల కనిపించినప్పటికీ శాంతిభద్రతలు కంట్రోల్ లోనే ఉన్నాయన్నారు. 2,472 కేసులు నమోదు అయ్యాయని, మొత్తం 14శాతం మేర నేరాలు పెరిగాయన్నారు. తీవ్రమైన నేరాల విభాగంలో హత్యలు 12, హత్యాయత్నాలు 8, కల్పేబుల్ హోమిసైడ్ 6 కేసులు నమోదు అయ్యాయన్నారు. మహిళలు, బాలికలపై జరిగిన నేరాలలో పోక్సో చట్టం కింద 18, రేప్ మూడు కేసులు నమోదయ్యాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 18కేసులు, చోరీ కేసులు 60కేసులు నమోదు కాగా గత ఏడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టాయన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 186మందికి గాయాలయ్యాయని, అందులో 77 మంది మృతి చెందారని పేర్కొన్నారు.
డ్రగ్స్ రహిత జిల్లాగా ములుగు : ములుగును డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఎన్డీపీఎస్ కేసులు 14నమోదయ్యాయని, 57.345 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని 38మందిని అరెస్ట్ చేశామన్నారు. ఇంకా ఎవరైనా గంజాయి సరఫరా, విక్రయం చేసినట్లు తెలిస్తే ప్రజలు సమాచారం అందించాలన్నారు. ఈ ఏడాది 26కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయని, కేసుల పరిష్కారం 58శాతం నమోదయ్యాయని తెలిపారు. మావోయిస్టు వ్యతిరేక చర్యల్లో 39 మంది అరెస్టు కాగా 87 మంది లొంగిపోవడం జరిగిందని, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీసు అధికారి సుధీర్ రాంనాథ్ కేకన్ వెల్లడించారు. సీఈఐఆర్ పోర్టల్ లో 413 కేసులు నమోదు కాగా 400మందికి పోగొట్టుకున్న తమ మొబైల్ పోన్లను తిరిగి అందించామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు శాఖ తీవ్రంగా శ్రయించి ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకుందని కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించామని, యుకతకు క్రీడలు నిర్వహించామన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతవాతావరణంలో జరిగేలా సిబ్బంది శ్రమించి పనిచేశారన్నారు. ప్రపంచ సుందరీ పోటీలకు వచ్చిన కాంపిటేటర్స్ కు భద్రత కల్పించామన్నారు. భరోసా కేంద్రాలకు వచ్చిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి అండగా నిలిచామన్నారు. మేడారంలో గద్దెల విస్తరణలో భాగంగా ఉత్తమ సేవలు అందిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. మహాజతరను సక్సెస్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి సదానందం, డీఎస్పీ ఎన్.రవీందర్, డీసీఆర్బీ డీఎస్ పీ కిషోర్ పాల్గొన్నారు.






