సమస్యాత్మక పంచాయతీల్లో కట్టుదిట్టమైన పోలీస్ భద్రత
వెంకటాపురం–వాజేడు మండలాల్లో పోలింగ్
వెంకటాపురం, డిసెంబర్ 16, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 18 గ్రామ పంచాయతీలు, వాజేడు మండలం లో 17 గ్రామ పంచాయతీలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటాపురం మండల పరిధిలోని తిప్పాపురం, కలిపాక, బోధపురం, పెంకవాగు, ఆలుబాక, సురవీడు, ఏదిర తదితర అటవీ గ్రామ పంచాయతీలను అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. మొత్తం 18 పంచాయతీలను సమస్యాత్మకంగా పరిగణిస్తూ జిల్లా పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 25,336 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 13,455 మంది మహిళా ఓటర్లు, 11,870 మంది పురుష ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉందని అధికారులు తెలిపారు. ఇంటర్నెట్ సదుపాయం లేని అటవీ గ్రామ పంచాయతీలలో పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వీడియోగ్రఫీ ఏర్పాటు చేయగా, మిగతా పంచాయతీలలో వెబ్‌కాస్టింగ్ లైవ్‌ను ములుగు జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసినట్లు వెల్లడించారు. మండలంలోని 18 పంచాయతీలలో 60 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా, వెంకటాపురం, మరికాల పంచాయతీలలో సర్పంచ్ పదవికి ఏడుగురు చొప్పున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బహుముఖ, త్రిముఖ, చతుర్ముఖ పోటీలతో ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, లంచ్ అవర్ అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో పోలింగ్ సామాగ్రి, బ్యాలెట్ పేపర్లు ఆర్వోలు, పోలింగ్ అధికారులకు పంపిణీ చేసి, సాయంత్రం లోగా తమ తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.







