సీతారాంపురం రోడ్డు – వంతెన నిర్మాణం చేపట్టాలి
– టి.ఏ.జి.ఎస్ వినతి
వెంకటాపురం, సెప్టెంబర్ 8 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని సీతారాంపురం గ్రామానికి రోడ్డు, వంతెన నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (టి.ఏ.జి.ఎస్) జిల్లా కమిటీ ఐటిడిఎ పీవో చిత్రామిశ్రాకు సోమవారం వినతి పత్రం అందజేసింది. ఇరుప శీను మాట్లాడుతూ గతంలో ఆలుబాక–సీతారాంపురం రోడ్డుతో పాటు పూసువాగుపై కల్వర్ట్ కోసం రూ.3.59 లక్షలు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదని, వర్షాకాలంలో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్డు, వంతెనల లేమితో గర్భిణీలు, జ్వరాలతో బాధపడుతున్న వారు ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలోని తాగునీటి బావిలో బురద కలిసిపోవడంతో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అధికారులు గ్రామానికి కనీసం రాకపోవడం వల్ల సమస్యలు మరింత పెరుగుతున్నాయని, తక్షణమే చర్యలు తీసుకోవాలని టి.ఏ.జి.ఎస్ కమిటీ డిమాండ్ చేసింది.