కొలువుదీరిన గణనాథులు – ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు
కన్నాయిగూడెం, ఆగస్టు 28, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గణనాథులు మండపాల్లో కొలువు దీరారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు బుధవారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలోని గణేష్ మండపాలను నిర్వాహకులు ప్రత్యేకంగా ముస్తాబు చేసి, వేద మంత్రోచ్ఛారణల మధ్య గణనాథుని ప్రతిష్ఠించారు. వేదపండితులు పూలు, గరక, ఉండ్రాల పాయసం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు భక్తులు గణనాథుని భక్తి శ్రద్ధలతో పూజలు, అర్చనలు చేయనున్నారు. ఇంటింటా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వాడవాడలో గణనాథులు కొలువుదీరడంతో కన్నాయిగూడెం మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.