ముత్యంధార జలపాతం వద్ద తప్పిపోయిన వరంగల్ యువకుడు
– రాత్రంతా అడవిలో గాలించి సురక్షితంగా కాపాడిన ఫారెస్ట్ శాఖ అధికారులు.
వెంకటాపురం, ఆగస్టు26, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని, వీరభద్రవరం, ముత్యంధార జలపాతల పర్యటకుల సందర్శన లను అటవీ శాఖ నిషేధించింది. వీరభద్రారం వద్ద అడవికి వెళ్లే మార్గాలను మూసివేసి ఫారెస్ట్ శాఖ కాపలాతో పాటు నిఘాను ఏర్పాటు చేసి సిబ్బందితో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ప్రమాదకరమైన అడవిలో ఉన్న జలపాతాన్ని పట్టణ ప్రాంత యువకులు ఫారెస్ట్ శాఖ అధికారుల సిబ్బంది కళ్ళు కప్పి దొంగ దారిన సందర్శించడానికి వెళ్లి అడవిలో తప్పిపోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ నగరానికి చెందిన అబ్రర్ హుస్సేన్ అనే యువకుడు, వీరభద్రవరం నిషేధిత ముత్యంధార జలపాతానికి సోమవారం ఒక్కడే వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కాలుజారి బండలపై పడటంతో స్వల్పంగా గాయపడ్డాడు. అప్పటికే బాగా చీకటి పడటంతో అడవిలో నుండే డయల్ 100 కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంకటాపురం ఫారెస్ట్ డివిజనల్ అధికారి ధ్వాలియా, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్. వంశీకృష్ణ, ఆయా సెక్షన్ ఆఫీసర్లు బీట్ ఆఫీసర్లు సిబ్బందిని అప్రమత్తం చేశారు. తప్పిపోయిన యువకుడు అబ్రర్ హుస్సేన్ ఫోన్ లొకేషన్ ఆధారంగా చీకట్లో అడవిలో సిబ్బంది తెల్లవారులు గాలింపు చేశారు. చిట్ట చివరకు మంగళవారం వేకువజామున తప్పిపోయిన పోయిన వరంగల్ యువకుడు సురక్షితంగా వెంకటాపురం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కు తరలించారు. ప్రధమ చికిత్స నిర్వహించి యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అటవీ శాఖ నిషేధించిన జలపాతాన్ని సందర్శించి తప్పిపోయిన అబ్రర్ హుస్సేన్ వరంగల్ లో డిగ్రీ పూర్తి చేసి పీజీ చదివేందుకు ప్రిపేర్ అవుతున్నట్లు సమాచారం. కాగ గత నెలలో మహితాపురం నూగురు జలపాతాన్ని వరంగల్ ప్రాంతానికి చెందిన ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు అడవిలో తప్పిపోయి డయల్ 100కు ఇచ్చిన సమాచారంతో పోలీస్ శాఖ, అటవీ శాఖ సంయుక్తంగా అడవిలో గాలించి సురక్షితంగా కాపాడారు. సెక్షన్ ఆఫీసర్లు దేవయ్య, శ్రీనివాస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు పవన్ హర్ష, పాలెం బీట్ ఆఫీసర్ శేషు, బేస్ క్యాప్ సిబ్బంది, తప్పిపోయిన వరంగల్ యువకుడిని క్షేమంగా బయటికి తీసుకు రావడం పట్ల పలువురు వారిని అభినందించారు.