ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
ములుగు, ఆగస్టు 14, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ముందు గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. జాకారం గ్రామానికి చెందిన ఆరెంధుల రాజయ్య ములుగులో కిరాయికి నివసిస్తూ పని నిమిత్తం ప్రతిరోజూ బస్సులో జాకారం వెళ్ళి వస్తుంటాడు. ఈ క్రమంలో గురువారం జాకారం నుండి ములుగు కు చేరుకొని బస్సు దిగుతున్న సమయంలో, దురదృష్టవశాత్తూ వెనుక చక్రాల కింద పడ్డాడు. టైర్లు పైనుంచి దూసుకు వెళ్లడంతో రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని ఏరియా ఆసుపత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం డాక్టర్ లు మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు రిఫర్ చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.