వాగులో కొట్టుకుపోయి గిరిజన మహిళ మృతి
– లక్ష్మీపురం గ్రామంలో విషాదం
వెంకటాపురం, ఆగస్టు 14, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రపురం పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఇర్ఫా లక్ష్మి (48) అనే గిరిజన మహిళ గ్రామ సమీపంలోని బండలవాగు దాటుతూ ప్రవాహం లో కొట్టుకుపోయింది. ఆమె కుమారుడు రమేష్ వాగు దాటి మోట్లగూడెం గ్రామానికి వెళ్లాడు. కొద్ది సేపటికి లక్ష్మి ఎవరి సహాయం లేకుండా వాగు దాటే ప్రయత్నంలో ప్రవాహంలో గల్లంతైంది. గురువారం గ్రామస్తులు వెంకటాపురం పోలీసులకు సమాచారం అందించారు. ఉదయం గ్రామస్తులు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టగా వాగు దాటుతున్న ప్రదేశానికి కిలోమీటర్ దూరంలో లక్ష్మి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై వెంకటాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మి మృతి పట్ల లక్ష్మీపురం, మోట్లగూడెం, పరిసర గ్రామాల్లో విషాదం అలముకుంది.