రైతులకు న్యాయం చేయకపోతే న్యాయపోరాటం తప్పదు
– బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత నామాజీ
నారాయణపేట, ఆగస్టు3, తెలంగాణజ్యోతి : కొడంగల్ ఎత్తి పోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత, క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ డిమాండ్ చేశారు. తద్వారా రైతుల న్యాయ హక్కుల కోసం అవసరమైతే న్యాయపోరాటానికి దిగుతామని స్పష్టం చేశారు. ఆదివారం నారాయణపేటలోని తన నివాసంలో 69 జీఓ పరిధిలో భూములు కోల్పోయిన పెరపళ్ల గ్రామ రైతులు నామాజీని కలిశారు. వారి వేదనను విన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ…”లగచర్లలో ఫార్మా కంపెనీ కోసం భూములు సేకరించి ఎకరాకు రూ.23 లక్షలు పరిహారం ఇచ్చారు. అదే ప్రభుత్వం నారాయణపేట రైతులకు మాత్రం ఎకరాకు కేవలం రూ.14 లక్షలే ఇవ్వడం అత్యంత అన్యాయమైందని, ఇది ద్వంద్వ ధోరణి అని విమర్శించారు. రైతులకు న్యాయమైన పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ఎత్తిపోతల పనులు ఆపే విధంగా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. “రైతులకి భరోసా ఇస్తూ సమాన నష్టపరిహారం అందేలా మనదైన పాత్ర పోషిస్తాం, అని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ లీగల్ సెల్ నాయకులు నందు నామాజీ బీకేఎస్ నేత మల్లప్పతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.