బలవంతపు భూసేకరణ ఆపాలని రాస్తా రోకో
నారాయణపేట, ఆగస్టు3, తెలంగాణజ్యోతి : నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో బలవంతంగా జరుగుతున్న భూసేకరణను తక్షణమే ఆపాలని కోరుతూ భూ నిర్వాసితులు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్యలు మాట్లాడుతూ ప్రాజెక్టు తొలి విడతలో భూములు కోల్పోతున్న రైతులకు కేవలం ఎకరాకు రూ.14 లక్షలే ఇస్తామంటూ భయపెట్టి భూములు తీసుకుంటుండటాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది రైతులను రోడ్డుపాలయ్యేలా చేసే చర్య అని అన్నారు. ప్రభుత్వం బయట మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకొని కనీసం ఎకరాకు ₹50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్య మంత్రి నియోజకవర్గానికి ఒక న్యాయం, ఇతర ప్రాంతాలకు మరో న్యాయం చేయడం సముచితం కాదని పేర్కొన్నారు. భూసేకరణను తక్షణమే నిలిపివేసి, రైతులతో సంపూర్ణంగా చర్చించిన అనంతరం మాత్రమే ముందుకు వెళ్లాలని కోరారు. రాస్తా రోకో కార్యక్రమంలో జోషి, మొగులప్ప, శ్రీనివాస్ రెడ్డి, నర్సిరెడ్డి, చంద్రశేఖర్, అశోక్, నారాయణ, బాల్రాజ్, కుమ్మరి రాజు, భూ నిర్వాసితులు, తదితరులు పాల్గొన్నారు.