వెంకటాపురం మండల బంద్‌ను జయప్రదం చేయండి
– చర్ల రోడ్డును రూ.100 కోట్లతో నిర్మించాలి – సిపిఎం డిమాండ్
– ప్రజల ప్రాణాల రక్షణకై సిపిఎం పోరాటానికి మద్దతు ఇవ్వండి
వెంకటాపురం, ఆగస్టు 1, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని నూగూరు నుండి యాకన్నగూడెం వరకు పూర్తిగా పాడైన రహదారి పునర్నిర్మాణానికి ప్రభుత్వం తక్షణమే రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 6న వెంకటాపురం మండల బంద్‌ను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గ్యానం వాసు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో నడుస్తున్న అనేక ఇసుక ర్యాంపుల కారణంగా వేలాదిగా ఇసుక లారీలు రాకపోకలు సాగిస్తుండటం తో వెంకటాపురం–ఎదిర–యాకన్నగూడెం ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. దాంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతూ, ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇసుక కాంట్రాక్టర్ల లాభాల కోసం అధికార, ప్రతిపక్ష నాయకులు పోటీపడుతూ ప్రజల ప్రాణాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. అనేక ఏళ్ల పోరాటంతో సాధించుకున్న రహదారి సౌకర్యాన్ని నేతలు అణచివేస్తున్నారని, ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి ఈ విధ్వంసానికి కారణమైందని విమర్శించారు. గడచిన రెండు నెలలుగా ఆర్టీసీ బస్సులు మండలంలో నడవకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం చేపట్టిన ఆందోళనల అనంతరం కేవలం గోతులు పూడ్చడం మినహా శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. 2022లో టీఆర్ఎస్ ప్రభుత్వం 11 కోట్లు కేటాయించి, అనంతరం మరోసారి 23 కోట్ల రూపాయలు కేటాయించి కేవలం 11 కిలోమీటర్ల రోడ్డు పనులను ఆ పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌కు అప్పగించారని, ఆ నిధులు కాంట్రాక్టర్ల చేతికి వెళ్లి అధికారులు జేబులు నింపుకోవడానికి మాత్రమే ఉపయోగపడాయని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మునుపటి పాలకుల బాటలోనే నడుస్తూ అదే దోపిడీ దందాను కొనసాగిస్తోందని మండిపడ్డారు. యాకన్నగూడెం వద్ద రాళ్లవాగు బ్రిడ్జి కూలిపోయి నెలలుగా భద్రాచలం నుండి వెంకటాపురానికి రాకపోకలు నిలిచిపోయినా, భద్రాచలం ఎమ్మెల్యే, ఎంపీలకు స్పందన లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, రహదారుల పునర్నిర్మాణాన్ని కోరుతూ సిపిఎం పార్టీ తలపెట్టిన ఉద్యమాలకు ప్రజలు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 2న నిరసన కార్యక్రమాలు, 4న రాస్తారోకో, 6న మండల బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వంకా రాములు, కుమ్మరి శీను, కట్ల నరసింహాచారి, మండల కమిటీ సభ్యులు చిట్టెం ఆదినారాయణ, గొంది రమణయ్య తదితరులు పాల్గొన్నారు.