ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం: సిపిఎం నేత జి. నాగయ్య
ములుగు, జూలై 31, తెలంగాణ జ్యోతి : ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, కార్పొరేట్ శక్తుల కోసం పని చేస్తూ ప్రజలను గాలికి వదిలేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి. నాగయ్య తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై స్పందించకుండా విదేశీ పెట్టుబడిదారులకు దాసోహంగా వ్యవహరిస్తోందన్నారు. ఉగ్రవాదం, వాణిజ్య ఒప్పందాలు, అంతర్జాతీయ రాజకీయాలపై కేంద్రం మౌనం పాటిస్తోందని, పాలస్తీనా-ఇజ్రాయిల్ యుద్ధంపై సైతం ప్రభుత్వ వైఖరి స్పష్టంగా లేదన్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 420 హామీలను ఇచ్చి వాటిలో చాలా వరకూ అమలు చేయలేదని విమర్శించారు. మహిళలకు రూ.2500, వ్యవసాయ కూలీలకు రూ.12,500, రైతు రుణమాఫీ, దళితబంధు, పోడు భూముల పట్టాల పంపిణీ, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఆమలులో విఫలమయ్యాయని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్లను అర్హులకే కాకుండా కేవలం కార్యకర్తలకు ఇస్తున్నారు. పోడు భూములు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. గుడిసెల్లో నివసించే వారికి పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.
ములుగు జిల్లాను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాల విఫలం : జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ
ములుగు జిల్లా సమస్యలపై సిపిఎం జిల్లా కార్యదర్శి బి. సాంబశివ మాట్లాడుతూ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా అభివృద్ధిపై పూర్తిగా నిర్లక్ష్యం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, ఇళ్ల పంపిణీ, పోడు భూముల పట్టాల విషయంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంకటాపురం మండలం ఎదిర వరకు రహదారులు దెబ్బతిన్నాయని, ఆ ప్రాంతంలో ఆగస్ట్ 6న బంద్‌కు పిలుపు నివ్వడం జరిగిందని తెలిపారు. అలాగే ఏటూరునాగారంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన టోల్ గేట్లను వెంటనే తొలగించకపోతే భవిష్యత్తులో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతాయని హెచ్చరించారు. కమలాపురంలోని పరిశ్రమ ప్రారంభించాలన్న హామీపై ప్రభుత్వం నిష్క్రియంగా ఉందని, వెంటనే ఫ్యాక్టరీ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా నాయకులు ఎం.దావూద్, పొదిళ్ల చిట్టిబాబు, గ్యానం వాసు, కొప్పుల రఘుపతి, బచ్చల కృష్ణ బాబు, ప్రవీణ్, చిటమట రమేష్, టి.ఎల్. రవి, సద్దాం హుస్సేన్, కలువల రవీందర్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.