నాగపంచమి సందర్భంగా అభయ నాగేంద్ర స్వామి ఆలయంలో పూజలు
నల్లబెల్లి, జూలై 29, తెలంగాణ జ్యోతి : నల్లబెల్లి లోని ప్రసిద్ధ అభయ నాగేంద్ర స్వామి ఆలయంలో సోమవారం నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాన్ని చేరుకొని, పుట్టలో పాలు పోసి నాగదేవతకు పూజలు సమర్పించారు. ఆలయం పరిసరాల్లో ఉన్న ఉసిరి చెట్టు కింద ప్రతిష్టించిన నాగ దేవతల విగ్రహాలకు అభిషేకాలు చేయడం, ధూప దీప నైవేద్యాలు సమర్పించడం, మొక్కులు చెల్లించడం వంటి పూజా కార్యక్రమాలు శ్రద్ధాభక్తులతో కొనసాగాయి. “ఏ ఒక్కరికి హాని కలగకుండా, అందరికీ మంచిని చేయు తండ్రి” అంటూ భక్తులు మనసారా ప్రార్థనలు చేశారు. ఈ వేడుకలకు మహిళలు, చిన్నారులు, వృద్ధులు సహా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం అంతా పుణ్యాత్మక శాంతి వాతావరణంతో మార్మోగింది. స్థానిక యువకులు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు సహాయం చేశారు.