రైతులకు ఉపయోగపడే వ్యక్తిగత పనులకు ప్రాధాన్యం
– ఎంపీడీవో, ఏపీవో
వెంకటాపూర్, జూలై 28, తెలంగాణ జ్యోతి : ఉపాధి హామీ, ఇందిరా మహిళా శక్తి పథకాల ద్వారా రైతులకు ఉపయోగపడే వ్యక్తిగత పనులకు ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తున్నదని ఎంపీడీవో మూడు రాజు, ఏపీవో మాలోత్ రాజు పేర్కొన్నారు. సోమవారం వెంకటాపురం మండల పరిషత్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ, 2025-26 ఆర్థిక సంవత్సరంలో గ్రామాల్లో సుస్తిర ఆస్తుల కల్పనకు లబ్ధిదారులను గుర్తించి, వాటిని ఫీల్డ్‌లో చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గతంలో కమ్యూనిటీ పనులకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వ్యక్తిగత పనులను ముందుగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ ఏడాది వెంకటాపురం మండలానికి పౌల్ట్రీ షెడ్లు 10 యూనిట్లు (100 నాటు కోడిపిల్లలతో) రూ. 85 వేలు పశువుల షెడ్లు 40 యూనిట్లు (3 పశువులు ఉండాలి) రూ. 98 వేలు గొర్రెలు/మేకల షెడ్లు 20 యూనిట్లు (10 గొర్రెలు/మేకలు ఉండాలి) రూ. 98 వేలు కొత్త బావి తవ్వకం 2 యూనిట్లు రూ. 3 లక్షలు, ఇంకుడు గుంతలు 200 యూనిట్లు రూ. 6,500, అజోళ్ల పెంపకం 10 యూనిట్లు రూ. 20 వేలు వెర్మీ/నాడెపు కంపోస్ట్ పిట్లు 10 యూనిట్లు రూ. 15 వేలు అలాగే ఎస్సీ, ఎస్టీ రైతుల సేద్యం లేని భూముల అభివృద్ధి పనులు, పండ్లతోటలు, ఆయిల్‌ఫామ్ తోటల కోసం 150 ఎకరాల మంజూరుకు అవకాశం ఉన్నదని తెలిపారు. పై పనులను చేయించుకునే ఆసక్తి ఉన్న రైతులు తక్షణమే తమ గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా ఫీల్డ్ అసిస్టెంట్‌ను సంప్రదించాలని, లేదంటే వెంకటాపురం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు ఎంపీడీవో మూడు రాజు- 9281484905, ఏపీవో మాలోత్ రాజు- 9281484774 ఫోన్ నంబర్లను సంప్రదించ వచ్చని సూచించారు.