భూమిని కోల్పోతున్న 20 గ్రామాల రైతుల ఆందోళన
– భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలంటూ కలెక్టరేట్ ముట్టడి
నారాయణపేట,జూలై 28, తెలంగాణజ్యోతి: నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పేరుతో ప్రభుత్వం బలవంతంగా రైతుల భూములను స్వాధీనం చేసుకుంటోందని, 2013 భూ సేకరణ చట్టానికి అనుగుణంగా న్యాయమైన పరిహారం చెల్లించాలని కోరుతూ నారాయణపేట జిల్లాలో భూ నిర్వాసితులు కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. రైతులను ప్రలోభాలు, మోసాలతో భూములు వదిలించుకోవడం కరెక్ట్ కాదని వారు విమర్శించారు. మున్సిపల్ పార్క్ నుంచి ర్యాలీగా ప్రారంభమైన ఉద్యమం, శాసనపల్లి రోడ్డులో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఆర్డీఓ రామచందర్ బెదిరింపులకు గురిచేయడం బాధాకరమని, బహిరంగ మార్కెట్ ధర ఆధారంగా బేసిక్ ధరను నిర్ణయించాలంటే ప్రత్యేక కమిషన్ వేయాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. 20 గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని తమ భూములపై తమ హక్కును రక్షించాలని ఉద్యమించారు. చివరకు కలెక్టర్ సచిన్ గంగ్వార్ వినతిపత్రం స్వీకరించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చిన తరువాత ఆందోళన విరమించారు.