మల్లెలో చెరువు అలుగు పనులు తక్షణమే చేపట్టాలి
నారాయణపేట,జులై28, తెలంగాణజ్యోతి : నారాయణపేట జిల్లా మల్లెలోని చెరువు అలుగు పునర్నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని ఆయకట్టు దారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో సుధారాణి, ఇరిగేషన్ ఏఈకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బి. యాదగిరి మాట్లాడుతూ గతంలో అధిక వర్షాల కారణంగా ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారుల ఆదేశాలపై చెరువు అలుగును తొలగించారని తెలిపారు. అలుగు తొలగించినప్పటి నుంచి చెరువులో నిల్వ ఉండాల్సిన నీరు పూర్తిగా వెలుపలికి వెళ్లిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల వచ్చిన నీరు కూడా అలుగు లేకపోవడంతో నిల్వ ఉండకుండా వెలుపలికి వెళ్లిపోతున్నదని పేర్కొన్నారు. ఈ సమస్యపై గతంలో కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించామని, వెంటనే పనులు చేపడతామ ని హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్ట లేదని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. వెంటనే పనులు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు బి. నరసింహ, ఏఐపీకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రాము, ఏఐయూకేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఏ. రాములు, ఆయకట్టుదారులు దస్తప్ప, రఘు, గుండెగరి లక్ష్మయ్య, వెంకటేష్, నర్సిములు, రాములు, బాలు, జెట్టి అంజి, మార్కండీ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.