భూ నిర్వాసితులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం

భూ నిర్వాసితులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం

భూ నిర్వాసితులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం

– రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్

నారాయణపేట, జులై 27, తెలంగాణజ్యోతి : నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు ఇచ్చే పరిహారం న్యాయసమ్మతంగా లేదని, భూసేకరణ విషయంలో ప్రభుత్వం అన్యాయంగా ప్రవర్తిస్తోందని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ అన్నారు. ఆదివారం నారాయణపేటలో గత 12 రోజులుగా కొనసాగుతున్న భూ నిర్వాసితుల రిలే దీక్షల్లో ముఖ్యవక్తగా పాల్గొని మాట్లాడారు. ఎకరానికి రూ.14 లక్షల పరిహారం సరిపోదని, రైతుల అభిప్రాయాలు పట్టించుకోకుండా భూసేకరణ చేపట్టడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం దయతో కాకుండా చట్టం ప్రకారం రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. జి.ఓ నెం.69 ప్రకారం ఈ ప్రాజెక్టును సాధించామని, ఇదొక త్యాగఫలమని తెలిపారు. పోరాటం ఈ ప్రాంత ప్రజలకు కొత్త కాదు, కానీ పాలకులు చిత్తశుద్ధితో న్యాయం చేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం అయినా రైతుకు న్యాయం జరగకపోతే ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని హెచ్చరించారు. రైతులు ఐక్యతగా పోరాడితే ఎంత మొండి ప్రభుత్వం అయినా దిగిరాక తప్పదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్మాణానికి 4500 కోట్ల కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం వ్యయం 10 వేల కోట్లకు పెంచేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వం, భూమి కొనుగోలు కోసం ఎకరానికి రూ.30 లక్షలు ఇచ్చినా మొత్తం ఖర్చు రూ.600 కోట్లు మాత్రమే అవుతుందని వివరించారు. ప్రభుత్వం రైతులను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం తప్పని, సంతోషంతో సంతకాలు పెట్టాల్సిన రైతులు భయంతో కన్నీళ్లతో సంతకాలు చేయాల్సిన పరిస్థితి దురదృష్టకరమన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యంలో అభివృద్ధి ఉండదన్నారు. ప్రాజెక్టు నీళ్లు వచ్చిన తర్వాత భూముల ధరలు మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉండగా, ఇప్పుడు సరిపడని పరిహారంతో భూములు తీసుకోవడం సరైంది కాదని తెలిపారు. రైతుకు తిరిగి భూమి కొనగలగే నమ్మకం కలిగినప్పుడే భూములు ఇచ్చేందుకు సిద్ధమవుతారని స్పష్టం చేశారు. 13వ రోజు రిలే దీక్షల్లో భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జీ. వెంకట్రామిరెడ్డి, అధ్యక్షులు మశ్చెందర్, ఉపాధ్యక్షులు ధర్మరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రాం, కానుకూర్తి గ్రామ మాజీ సర్పంచ్ భీమ్ రెడ్డి మాట్లాడారు. దీక్షలో కానుకూర్తి, మల్లెరెడ్డిపల్లి గ్రామాల భూ నిర్వాసితులు పాల్గొన్నారు. అలాగే భూ నిర్వాసితుల సంఘ నాయకులు హన్మంతు, రామకృష్ణ, మహేష్ కుమార్ గౌడ్, ఆంజనేయులు, భీమప్ప, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment