పరీక్షల నిర్వహణపై అదనపు కలెక్టర్ హఠాత్ తనిఖీ
నారాయణపేట, జులై 27, తెలంగాణ జ్యోతి : లైసెన్స్డ్ సర్వేయర్లు, గ్రామ పరిపాలన అధికారి నియామకానికి సంబంధించి నారాయణపేట జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఆదివారం అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వర్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి, అభ్యర్థుల హాజరు వివరాలు అడిగి తెలుసు కున్నారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు పారదర్శకంగా, పకడ్బందీ గా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహించిన గ్రామ పాలనాధికారి పరీక్షకు 76 మంది అభ్యర్థులు ఎంపిక కాగ 73 మంది హాజరై ముగ్గురు గైర్హాజ రైనట్లు తెలిపారు. అదే సమయంలో నిర్వహించిన లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్షకు 106 మంది అభ్యర్థుల్లో 96 మంది హాజరై, 10 మంది గైర్హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరిగిన రెండవ విడత లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్షకు 106 మంది అభ్యర్థుల్లో 95 మంది హాజరైనట్లు అదనపు కలెక్టర్ వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి నకలు జరగకుండా పరీక్షలు నిష్పాక్షికంగా, సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ రామచంద్ర నాయక్, సర్వే ల్యాండ్ ఏ.డి. గిరిధర్, డిపార్ట్మెంటల్ అధికారులు, తహసీల్దార్ అమరేంద్ర కృష్ణ పాల్గొన్నారు.