వెంకటాపురంలో ప్రమాద భరితంగా మారిన ప్రధాన రహదారి
– ప్రజల్లో ఆందోళన
వెంకటాపురం, జూలై 27, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గమ్మ గుడి వద్ద ఉన్న ప్రధాన రహదారి (ఎస్. హెచ్.12) భారీ వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారింది. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ఈ రహదారి అంచు వరకు వర్షాలతో మట్టి కొట్టుకుపోవడంతో ప్రమాద భరితంగా మారింది. వాజేడు, జగన్నాథపురం, చర్ల-భద్రాచలం మార్గాల్లోకి వెళ్లే వాహనాల రాకపోకలతో రహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వందలాది లారీలు, ఇతర వాహనాలు ఈ దారిలో పయనిస్తుంటాయి. దాదాపు పది రోజులు గడుస్తున్నా సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు స్పందించక పోవడంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు గోతిలో పడి భారీ ప్రమాదాలు జరగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకుని గోతిని పూడ్చి ప్రమాద నివారణ చేయాలని వారు రోడ్లు భవనాల శాఖ అధికారులను పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు.