సోషల్ వెల్ఫేర్ పాఠశాల సమస్యను పరిష్కరించాలి
– ఎస్ఎఫ్ఐ–డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంత్రి క్యాంప్ ఆఫీస్ ముట్టడి
ములుగు, జూలై 25, తెలంగాణ జ్యోతి : మల్లంపల్లిలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల పరిస్థితి దయనీయంగా ఉందని, విద్యార్థుల మౌలిక సమస్యలు పరిష్కరించకపోతే ఏటూరు నాగారం మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సాదు రాకేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కలువల రవీందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టీఎల్ రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లంపల్లి పాఠశాలలో వర్షం పడితే నీరు నేరుగా గదులలోకి చేరుతున్నదని, బాత్రూముల్లేక విద్యార్థులు అటవీ ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఫ్యాన్లు, కిటికీలు లేని గదుల్లో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, అధికారులకు పదే పదే చెప్పినా స్పందన లేదని ఆరోపించారు. ఈ పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో విద్యా కార్యకలాపాలు సాగడం లేదని తెలిపారు. పాఠశాల అగ్రిమెంట్ జూలైతో ముగియనుండగా, కొందరు దీన్ని హనుమకొండకు తరలిం చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా మల్లంపల్లి పాఠశాలను ఏటూరునాగారానికి తరలించాలని డిమాండ్ చేశారు. లేనియెడల మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిం చాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్, రమేష్, బాలు, యుగేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.