జ్వరంతో నాలుగేళ్ల బాలుడు మృతి
– ములుగు మండలం జంగాలపల్లిలో విషాదం
ములుగు ప్రతినిధి, జూలై 24, తెలంగాణ జ్యోతి : జ్వరం బారిన పడి బాలుడు మృతిచెందిన విషాద సంఘటన ములుగు జిల్లా ములుగు మండలం జంగాలపల్లిలో గురువారం చోటు చేసుకుంది. బాలుడి తల్లి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. జంగాలపల్లి గ్రామానికి చెందిన చెలిమెల తిరుమల, సురేష్ (లేట్) దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు హిమ వర్షిత్(4)కు మూడు రోజల క్రితం జ్వరం రావడంతో ఆస్పత్రిలో వైద్యం చేయించారు. బుధవారం బాలుడి పరిస్థితి విషమించడంతో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. పరిస్థితి విషమించ డంతో వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున బాలుడు మృతిచెందాడు. రెండేళ్ల క్రితం భర్త, ఇప్పుడు అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ జ్వరంతో మృతిచెందడంతో బాలుడి తల్లి, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.