వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ శబరీష్
వెంకటాపూర్, జూలై 24, తెలంగాణ జ్యోతి : వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ను ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి ఐపీఎస్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలలో భాగంగా స్టేషన్కు చేరుకుని వివిధ విభాగాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్లో సిబ్బంది ఫిర్యాదు దారులతో మర్యాదగా వ్యవహరించాలని, ఫిర్యాదు అందిన వెంటనే విచారణాధికారిని నియమించి ఆలస్యం కాకుండా కేసు నమోదు చేయాలని సూచించారు. 5S విధానం అమలు పద్ధతులను పరిశీలించి, స్టేషన్ రికార్డుల నిర్వహణలో ప్రతి విభాగానికి ప్రత్యేకంగా ఒకరిని నియమించి పెండింగ్ లేకుండా ఫైళ్ళు పూర్తి చేయాలని ఆదేశించారు. విచారణలో ఉన్న కేసుల్లో స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలనీ, మిస్సింగ్ కేసుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని, కంప్యూటర్ సిబ్బంది పనితీరును సమీక్షించి ఆన్లైన్లో అప్డేట్లను వెంటనే నమోదు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి, హెల్మెట్, సీటు బెల్ట్ వాడకంపై తగిన దృష్టి సారించాలని, మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవా లని, బాధితులను రిహాబిలిటేషన్ కేంద్రాలకు తరలించి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. సైబర్ మోసాలు, గేమింగ్, బెట్టింగ్ యాప్ల ద్వారా జరుగుతున్న మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. యాక్సిడెంట్ కేసుల్లో స్వాధీనంలో ఉన్న వాహనాలను వాటి యజమానులకు కేసు స్థితిని బట్టి అందజేయాలని, ప్రతి పోలీసు సిబ్బందిని విడివిడిగా ప్రశ్నించి వారి విధులు, వ్యక్తిగత సమస్యలపై ఆరా తీశారు. ఈ తనిఖీలో ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, ములుగు సీఐ సురేష్, వెంకటాపూర్ ఎస్హెచ్ఓ రాజు తదితర అధికారులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.