చందాలు వేసుకుని కాలువను రక్షించిన గిరిజన రైతులు
ఇంజినీరింగ్ అధికారుల చర్యలు తీసుకోవాలి
వెంకటాపురం, జులై 24, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పాలెం ప్రాజెక్టు ప్రధాన పంట కాలువకు బొల్లారం వద్ద బుంగ ఏర్పడింది. కాలువకు గండి పడే ప్రమాదం ఉండటంతో పక్కనే ఉన్న తమ పొలాలకు ముప్పు తలెత్తనుందన్న ఆందోళనతో బొల్లారం గిరిజనరైతులు సమిష్టిగా చందాలు వేసుకుని ట్రాక్టర్లు, జెసిబీలతో బుంగను పూడ్చారు. సుమారు రూ. 10 వేలు ఖర్చు చేసి తాము శ్రమదానం చేశారు. రెండు వందల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు 14 కిలోమీటర్ల ప్రధాన కాలువ ఉన్నా, లస్కర్లు లేకపోవడం, ఇంజనీరింగ్ అధికారులు పట్టణాల్లో ఉండిపోవడం వల్ల కాలువ సంరక్షణ నిర్లక్ష్యంగా మారింది. గిరిజనుల విజ్ఞప్తులకు స్పందించని అధికారులు “గండి పడితే చూస్తాం” అంటూ చులకనగా మాట్లాడారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పంట పొలాలు కొట్టుకుపోకుండా రక్షించుకునేందుకు చర్యలు తీసుకున్న గిరిజన రైతులు, బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న పాలెం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.