భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ములుగు ప్రతినిధి, జులై 23, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శబరీష్.పి సూచించారు. వాతావరణ శాఖ వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసినందున గోదావరి పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్టులు, రహదారులపై నుంచి దాటకూడదని, శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండకూడదని, తడి కరెంట్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు తాకకూడదని, గ్రామాల్లో చేపల వేటకు ఎవరూ వెళ్లకూడదని, అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ బయటకు రావద్దని సూచించారు. అలాగే, బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు. జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసినట్టు తెలిపారు. ఏవైనా విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటిని సమర్థంగా ఎదుర్కొనడానికి జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు జిల్లా విపత్తు ప్రతిస్పందన దళాలు(DDRF) ఏర్పాటు చేయబడినట్టు తెలియ జేశారు. అత్యవసర సమయంలో ప్రజలు పోలీసుల సహాయం పొందేందుకు 100 నెంబర్‌ను వినియోగించు కోవాలన్నారు.