హత్య కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష
భూపాలపల్లి, జూలై 15, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లా కమలాపురం గ్రామ శివారులో 2020 మార్చి 2న చోటు చేసుకున్న హత్య కేసులో నిందితుడైన మాచెర్ల రవికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి చి. రమేష్ బాబు మంగళవారం తీర్పు వెలువరించారు. కేసు వివరాల ప్రకారం… కమలాపురం గ్రామానికి చెందిన రేగల్ల తిరుపతి తన స్నేహితులతో కల్లు తాగుతుండగా, గతంలో ఉపాధి హామీ పనుల పేరుతో డబ్బులు తీసుకొని చెల్లించని విషయాన్ని తీర్పుగా నిలదీసినందుకు గ్రామస్తుడు మాచెర్ల రవి మనసులో పెట్టుకొని, తిరుపతిపై కత్తితో దాడి చేసి అక్కడికక్కడే హత్య చేశాడు. ఈ ఘటనపై మృతుడి భార్య రేగల్ల కోమల భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్ఎచ్ఓ వాసుదేవరావు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును పకడ్బందీగా దర్యాప్తు చేసి, సమగ్ర ఆధారాలతో చార్జ్‌షీట్ ఫైల్ చేశారు. కోర్టులో లైజన్ ఆఫీసర్ గాండ్ల వెంకన్న ఆధ్వర్యంలో కానిస్టేబుల్ కళ్యాణి సాక్షులను సమయానికి హాజరు పరచగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదులాపురం శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అందులోనూ నిందితుడిపై నేరం రుజువవడంతో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు. ఈ కేసులో న్యాయం జరగేలా కృషి చేసిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, ప్రస్తుత ఎస్ఎచ్ఓ నరేష్ కుమార్, అప్పటి దర్యాప్తు అధికారి వాసుదేవరావు, కోర్టు లైజన్ అధికారులు, కానిస్టేబుల్ కళ్యాణిని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అభినందించారు.