అనధికార చిట్ ఫండ్, అక్రమ ఫైనాన్స్‌లపై కఠిన చర్యలు
– ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఉపేక్షించము
– ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి, జులై14, తెలంగాణజ్యోతి : జిల్లాలో అనధికార చిట్ ఫండ్, అక్రమ ఫైనాన్స్ కార్యకలాపాలు చేస్తూ ప్రజలను వేధించే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజా దివస్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన 24 మంది బాధితులు ఎస్పీని కలసి తమ సమస్యలను వివరించారు. వారిలో పలువురు అనధికారిక చిట్ ఫండ్, ఫైనాన్స్ మోసాలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అనుమతి లేకుండా చిట్ ఫండ్‌లు నడుపుతున్నవారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రకమైన దందాలతో ఇబ్బందులు పడుతున్న వారు సిసిఎస్/టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నంబరు 87126 58108 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. పేదలు, సామాన్యులు మోసపోవద్దన్నదే పోలీసు శాఖ లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు.