Mulugu Sp | పోరు కన్నా ఊరు మిన్న
– లొంగిపోయిన ఐదుగురు మావోయిస్టు సభ్యులు
– వివరాలు వెల్లడించిన ఎస్పి శబరిష్
ములుగు ప్రతినిధి, జూలై 14,తెలంగాణ జ్యోతి : పోరు కన్నా ఊరు మిన్న అనే పోలీసు శాఖ పిలుపు మేరకు మావోయిస్టులు వనం వీడి జనంలో కలిసేందుకు నిర్ణయం తీసుకుంటున్నారని జిల్లా ఎస్పి డాక్టర్ పి.శబరీష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో చతిస్గడ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు మావోయిస్టు సభ్యులు ఎస్పీ ఎదుట లొంగిపోయారు. వారికి రూ.25వేల చొప్పున చెక్కులను అందజేశారు. మిగిలిన రూ.6,75 వేలను వారి ఖాతాలో జమ చేస్తామని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హింసాత్మక సంఘటనలతో మావోయిస్టులు అమాయక గిరిజనులను భయాందోళనకు గురిచేస్తున్నారని, ప్రజలతో కలిసి ప్రజా జీవనం గడిపేందుకు అడవులను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. కోరుకున్న ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమంలో భాగంగా జనవరి నుంచి ఇప్పటివరకు 73 మంది మావోయిస్టులు లొంగి పోయారని ఎస్పీ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి పట్ల నిబద్ధతతో ఉందని, అటవీ ప్రాంతాల్లోని ఆదివాసీలు తమ సంపదనను స్వేచ్ఛగా వినియోగించుకునేలా పోలీసు శాఖ కేంద్ర బలగాలు అవసర మైన క్యాంపులు ఏర్పాటు చేయనున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా లొంగీపోయిన వారిలో చత్తీస్గడ్ కు చెందిన శ్యామల రాజేష్, కడితి డుమ, ఊకే జోగి, బాడిశ బీమా, ముచ్చటి జోగిలు ఉన్నారు.