గ్రామీణ యువతకు మత్తుపదార్థాల పట్ల అవగాహన
– చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీసుల సూచన
వెంకటాపురం, జూలై 12, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అభయ మిత్ర కార్యక్రమంలో భాగంగా గ్రామీణ యువతకు మత్తుపదార్థాల ప్రమాదకర ప్రభావంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్‌స్పెక్టర్ జి. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోటార్ వాహనాల చట్టాలపై, ట్రాఫిక్ నియమాలపై, హెల్మెట్ ధరించడం, ట్రిపుల్ రైడింగ్ నిషేధం, వాహన పత్రాలు (ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్) తప్పనిసరిగా ఉండాలని వివరించారు. మహిళల గౌరవం, చట్టపరమైన అంశాలలో పోక్సో యాక్ట్ నియమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అవగాహన కార్యక్రమం అనంతరం పేరూరు యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు.