విద్యార్థులకు చదువుతోపాటు నాన్యమైన భోజనం ఇవ్వాలి
– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
– కాటారం మండలంలో ఆకస్మిక తనిఖీలు
కాటారం,జూలై11,తెలంగాణజ్యోతి : విద్యార్థులకు చదువుతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం కాటారం మండలం, దామెరకుంట లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, గంగారం మోడల్ పాఠశాలలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. దామెరకుంట గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల తనిఖీ సందర్భంగా పాఠశాలలో పరిశుభ్రత కరువైందని గుర్తించి కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డైనింగ్ హాల్ పరిశీలించి వంట కోసం తతెచ్చిన కూరగాయలు పరిశుభ్రంగా లేకపోవడం, వంటగదిలో ఈగలు ఉండడం, వంటగది పరిసరాలు ఆపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని, ఆహార తయారీ ప్రదేశాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యానికి హాని కలగకూడదని, పాఠశాలలో పరిశుభ్రత, పారిశుద్య ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. తాను. మళ్ళీ తనిఖీకి వస్తానని మార్పు రాకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిశుభ్రత పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వంట గది, డైనింగ్ హాల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాని హెచ్చరిం చారు. వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు అనారోగ్య బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్ , స్టోర్ రూమ్, డార్మెటరీలను పరిశీలించి విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. కొన్ని చోట్ల భవనం పెచ్చులు ఊడుతున్నాయని విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో తరగతి గదులు సరిపోవడం లేదని ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా పాఠశాల వెనకాల నిరుపయోగంగా ఉన్న జూనియర్ కళాశాల భవనాన్నీ పరిశీలించి మరమ్మతులు చేసి అందు బాటులోకి తేవాలని టి.ఎస్ ఈడబ్ల్యూఐడిసి ఈ.ఈ కి తక్షణమే ఫోన్ చేసి ఆదేశించారు. అనంతరం గంగారంలోని తెలంగాణ మాడల్ పాఠశాలను సందర్శించి పాఠశాలలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. పాఠశాల వెనుకాల గల హాస్టల్ భవనాన్ని పరిశీలించి త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల భవనం ముందు కొంత మేర మిగిలిన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, పాఠశాల విద్యార్థుల కోసం వంట గది నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని ప్రధానోపాధ్యాయులు కోరగా నిధులు మంజూరు చేస్తామని హాస్టల్ భవనం లో గీజర్లతో పాటు కావలసిన మౌలిక వసతుల కల్పనకు నివేదికలు అందించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
తహసిల్దార్ ఆఫీస్ తనిఖీ
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం కాటారం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ఫైళ్ళను కలెక్టర్ పరిశీలించారు. మండలంలో జరుగుతున్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూ సేకరణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూ భారతి లో వచ్చిన దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకుని ఎంత మందికి నోటీసులు జారీ చేశారని ప్రశ్నించారు. మొత్తం మండలంలో 5,610 భూభారతి దరఖాస్తులు వచ్చాయని అందులో 412 మంది దరఖాస్తు దారులకు నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దార్ నాగరాజు తెలిపగా భూ భారతి లో వచ్చిన దరఖాస్తులను క్రేత్ర స్థాయిలో పరిశీలించి ఆగస్ట్ 15 వ తేదీ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో బాబు డిటి రామ్మోహన్, ఆర్.ఐ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.