టేకులగూడెం వంతెనపై వరద ఉధృతి- తాత్కాలిక మూసివేత
– జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పి.
వెంకటాపురం,జూలై 11 తెలంగాణ జ్యోతి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న విస్తృత వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పి. సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ ములుగు జిల్లా ఎగువ ప్రాంతాల నుండి గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో, జాతీయ రహదారి 163 పై పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం శివారులోని రేగుమాగు వాగు పొంగి ప్రవహిస్తోందన్నారు. టేకులగూడెం వంతెనపై వరదనీరు చేరడంతో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని వంతెనను తాత్కాలికంగా మూసి వేసినట్లు ప్రకటించారు. వంతెన ప్రవేశద్వారాల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే సమీప పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. అత్యవసర ప్రయాణాల కోసం తెలంగాణ – ఛత్తీస్‌ఘడ్ మధ్య ప్రయాణించవలసినవారు, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మార్గాన్ని ఉపయోగించుకోవచ్చని ఎస్పీ గారు స్పష్టం చేశారు.