భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
– జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో ఘనంగా నిర్వహణ
– ధన్వాడలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు దంపతుల అభిషేక సేవలు
– గణపురం సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు
కాటారం,జూలై10,తెలంగాణజ్యోతి :జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధల తో ఘనంగా నిర్వహించాయి. జిల్లా నలుమూలలా ఉన్న శ్రీ దత్తాత్రేయ, షిరిడి సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున పూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా దత్తాభిషేకం, సహస్రనామార్చన, మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ, అన్నదానం నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు దంపతులు హాజరై స్వామికి అభిషేక సేవలు నిర్వహించారు.రాష్ట్రప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారో గ్యాలతో ఉండాలని కోరుతూ వేదపండితుల ఆశీర్వచనం స్వీకరించారు. ఇదే తరహాలో కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి అనుబంధంగా ఉన్న దత్తాత్రేయ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఉప ప్రధాన అర్చకులు పనకంటి పనింద్ర శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు వేడుకలను నిర్వహించారు. కాలేశ్వరం ప్రధాన దేవాలయంలో శ్రీ శుభానంద దేవి మరియు శ్రీ మహా సరస్వతి దేవి వారికి శాఖాంబరి అలంకరణలు నిర్వహించారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయంలో అభిషేకాలు నిర్వహించి అమ్మవార్ల దర్శనం పొందారు. గణపురం మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ – “గురు శిష్య సంబంధం ఎటువంటి పేగుబంధం లేనిది, అది పరమాత్మ సంబంధం. గురువు ఆశించకుండా విద్యను ప్రసాదిస్తారు, శిష్యుడు తన సర్వస్వాన్ని గురువుకు అంకితం చేస్తాడు” అన్నారు. విద్యార్థులు గురువు బాటలో నడుస్తేనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని సూచించారు.