Mantri Seetakka | పదేళ్ల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోలేరు
– ప్రజలే నిజమైన నిర్ణేతలు
– రాష్ట్ర మంత్రి సీతక్క
ములుగు ప్రతినిధి, జూలై9, తెలంగాణ జ్యోతి : గత పదేళ్లు అధికారంలో ఉన్న వారు పేదలకు ఇళ్లు ఇవ్వకుండా, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినప్పటికీ ఇప్పుడు వేదికలపై ప్రగల్బాలు పలుకుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ (సీతక్క) తీవ్రంగా విమర్శించారు. బుధవారం ములుగు లీలా గార్డెన్స్‌లో జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్‌పర్సన్ రేగా కళ్యాణి ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి, కార్యకర్తల మద్య తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, తాను చివరి శ్వాస వరకు ప్రజలకోసం పనిచేస్తానని, ప్రజల్లో ఉంటూ సేవచేసే వారికే పదవులు వస్తాయని స్పష్టం చేశారు. ములుగుకు ఇప్పటికే 5వేల ఇండ్లు మంజూరు చేయగా, మరో 1,000 ఇళ్లు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారన్నారు. బందాల, వెంకటాపురం, ఇంచించెర్వుపల్లి గ్రామాల్లో ఇండ్లు కాలిపోతే ఒక్క ఇల్లు కూడా ఇవ్వని పూర్వవాళ్లు, ఇప్పుడు పథకాలను అడ్డుకుంటూ బదనాం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పేదల మేలు కోసం తాను నిబద్ధతతో పనిచేస్తున్నానని, కాంగ్రెస్ సైన్యం వానరసైన్యంలా పనిచేసి ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు వివరించాలని, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగా కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.