భూ భారతి పైలట్ ప్రాజెక్ట్‌లో 1841 దరఖాస్తులకు ఆమోదం
– 4555 దరఖాస్తులు స్వీకరణ
వెంకటాపూర్, జూలై 9, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో భూ భారతి పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఏప్రిల్ 17 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 9 రెవెన్యూ గ్రామాల నుండి 4555 దరఖాస్తులు స్వీకరించామని ఆర్డీఓ వెంకటేష్ బుధవారం వెల్లడించారు. ఈ దరఖాస్తులను 9 రెవెన్యూ బృందాలు పరిశీలించి 1841 దరఖాస్తులను ఆమోదించాయన్నారు. వీటిలో 1374 సాదబైనామా దరఖాస్తులు ఉండగా, ప్రస్తుతం ఈ ప్రక్రియ రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన పరిధిలో ఉందని తెలిపారు. అలాగే 513 POT దరఖాస్తులు, 143 కొత్త అసైన్మెంట్ దరఖాస్తులు అర్హులుగా గుర్తించబడ్డాయని చెప్పారు. రైతుల సమాచారం కోసం, సాదబైనామా తప్ప అన్ని ఆమోదించబడిన దరఖాస్తులు భూ భారతి పోర్టల్‌లో అప్డేట్ చేయబడ్డాయని తెలిపారు. పిటిషన్ స్థితిగతుల వివరాలకు మొబైల్ నెంబర్ 99858 39187 కు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 మధ్య కాల్ చేయవచ్చు లేదా వెంకటాపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించవచ్చని పేర్కొన్నారు.