ఆదివాసిల సాగు భూములకు అసైన్డ్ పట్టాలు ఇవ్వాలి
– పూనెం రామచంద్రరావు
వెంకటాపురం, జూలై 8, తెలంగాణ జ్యోతి : వెంకటాపురం మండలంలో ఆదివాసులు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములకు అసైన్డ్ పట్టాలు మంజూరు చేయాలని భూమిపుత్ర ఆదివాసి సంఘం డిమాండ్ చేస్తూ మంగళవారం తాసిల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూనెం రామచంద్రరావు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఆదివాసులు సాగుచేస్తున్న భూములకు అసైన్మెంట్ కమిటీ వేసి పట్టాలు ఇవ్వకపోవడం వల్ల వారు అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షెడ్యూల్ ఏరియాల్లో గిరిజనేతరులకు భూములు మంజూరు చేస్తూ, అసలు హక్కుదారులైన ఆదివాసుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. తక్షణమే అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి జీవో జారీ చేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాటి లక్ష్మణ్, కోరం ప్రసాద్, సోడి మోహన్రావు, సోడి హరిబాబు, బాడిస సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.