గుడుంబా గుప్పు.. పల్లెకు ముప్పు…
– జీవితాలను చిత్తుచేసే మత్తు నుండి బయటపడండి
– ఎస్సై ఇ. వెంకటేష్
కన్నాయిగూడెం,జూలై 8, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా పోలీసు శాఖ గుడుంబా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు కన్నాయిగూడెం ఎస్సై ఇ. వెంకటేష్ నేతృత్వంలో గుడుంబా నిర్మూలన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై ఇ. వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిషేధిత నాటుసారా తయారు చేయడం చట్ట వ్యతిరేకమని, గుడుంబా తాగడం ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందన్నారు. గుడుంబా తయారీలో యూరియా, మురికి నీరు, పటికబెల్లం వంటి హానికర పదార్థాలు వాడటం వలన తాగేవారి ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందన్నారు. కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ నిబంధనలను విస్మరించి, డబ్బు కోసం నిషేధిత గుడుంబా తయారీలో పాల్గొంటున్నారన్నారు. వీరు ఇండ్ల వద్ద, పంట పొలాల్లో, అటవీ ప్రాంతాల్లో రహస్యంగా నాటుసారా తయారీ కొనసాగిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే వారి వివరాలను సేకరిస్తున్నామని, త్వరలోనే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. పాలకులు, పోలీసు శాఖ, గ్రామ స్థాయిలోని నాయకత్వం గుడుంబా నిర్మూలనకు సమష్టిగా పనిచేయాలని కోరారు. గ్రామస్తులు కూడా బాధ్యతగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని సూచించారు.