MULUGU | నకిలీ విత్తనాలతో రైతులు మోసపోవద్దు
– విత్తన చట్టాన్ని రూపొందించుటకు చర్యలు తీసుకుంటున్నాం.
– లక్ష ఐదు కోట్ల రూపాయలతో రైతులకు సంక్షేమ ఫలాలు.
– కర్రె గుట్టలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతాం.
– జిల్లా అధికారుల సమిష్టి కృషితోనే రైతులకు
నష్ట పరిహారం.
– పట్టు వదలని విక్రమార్కుడిలా పనిచేసిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
– రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ , సహకారం, చేనేత, వస్త్రాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.
– ఇందిరమ్మ పాలనలో దళారీ దందా ఉండదు.
– గిరిజన ప్రాంతంలో నకిలీ పదం వినిపిస్తే సహించేది లేదు.
– రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క.
వెంకటాపురం, జులై 7, తెలంగాణ జ్యోతి : నకిలీ విత్తనాలతో రైతులు మోసపో వద్దని, విత్తన చట్టాన్ని రూపొందించుటకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ , సహకారం, చేనేత, వస్త్రాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సోమవారం ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో వాజేడు, వెంకటాపురం, కన్నాయి గూడెం మండలాల్లో 1521 ఎకరాల్లో మొక్కజొన్న వేసి పంట నష్టపోయిన 671 రైతులకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ , సహకారం, చేనేత, వస్త్రాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, తెలంగాణా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, తెలంగాణా విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్. అన్వేష్ రెడ్డి, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఐటీడిఏ పి.ఓ.చిత్ర మిశ్రా లతో కలిసి 3 కోట్ల 80 లక్షల 97 వేల 264 రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ జిల్లాలోని వాజేడు,వెంకటాపురం, కన్నాయి గూడెం మండలాల్లో మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన రైతులందరికీ ప్రైవేట్ కంపెనీల ద్వారా నష్టపరిహారం అందించ డం జిల్లా అధికారుల సమిష్టి కృషితోనే సాధ్యమైందని, రాష్ట్రం లోని రైతులకు లక్ష అయిదు కోట్ల రూపాయలు అందించి రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నామని అన్నారు. రైతులు విత్తనాలతో మోసపోకుండా రాష్ట్రంలో విత్తన చట్టాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. ఆదివాసీల జీవన విధానంలో మార్పు రావడానికి మంత్రి సీతక్క ప్రజా జీవితాన్ని ప్రారంభిం చడం గొప్ప విషయమని, ప్రైవేటు కంపెనీల యజమానుల మెడలు వంచి రైతులకు నష్టపరిహారం అందించడం జిల్లా అధికారుల కృషి ఎన్నటికీ మరువలేమని అన్నారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అభివృద్ధి ఫలాలను అమలు చేస్తున్నదని, గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కలిగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ములుగు జిల్లాలో పర్యటక ప్రాంతాలు ఉన్నాయని, రానున్న రోజులలో కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతం గా తీర్చిదిద్దామని తెలిపారు. గతం లోని పాలకులు రైతులకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నారని, తాము అధికారం లోకి వచ్చిన అనంతరం ఇందిరమ్మ రాజ్యం ద్వారా రైతులకు అన్ని సంక్షేమ ఫలాలను అందజేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు సహకరించకపోయిన అప్పులు తీర్చు తూనే నూతన పథకాలను. ప్రవేశపెడుతున్నామని, జిల్లాలో పామాయిల్ పంట సాగు చేయడమే కాకుండా హార్టికల్చర్, సెరికల్చర్ ద్వారా రైతులకు ఆదాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులు దళారులను ఆశ్రయించ కుండా విత్తనాలు, ఫర్టిలైజర్ కొనుగోలు చేసిన పక్షంలో బిల్లులు తప్పనిసరిగా పొందాలని, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఐదు నెలల పోరాట ఫలితంగా నేడు రైతులు ప్రైవేట్ కంపెనీల ద్వారా నష్ట పరిహారం పొందుతున్నారని, ఇది చరిత్రలోనే నిలిచిపోతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ పలుసార్లు సమావేశాలు నిర్వహించడమే కాకుండా ప్రైవేట్ కంపెనీలను ఒప్పించడంలో విజయం సాధించ్చారని హర్షం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాలలో లారీల సమస్య అధికమైందని సమస్య పరిష్కారం కోసం జిల్లా పోలీసు యంత్రాంగం తో చర్చించడం జరిగిందని, అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలువురు మోసానికి గురి చేస్తారని తెలిపారు. దళారీ వ్యవస్థ రూపుమా పేందుకు ప్రతి ఒక్కరూ కంకణ బదులు కావాలని పిలుపు నిచ్చారు. 2019 సంవత్సరంలో రైతులు 2 వేల ఎకరాల మిర్చి పంట కోల్పోగా గత పాలకులు ఏ మాత్రం పట్టించుకోకుండా నేడు తాము చేస్తున్న పని తనాన్ని జీర్ణించుకోని కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను రైతులను ఎవరు మోసం చేసిన నష్టపరిహారం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇది రైతులు సాధించిన విజయం అని, ఐదారు నెలలుగా ఈ సమస్య పై పోరాట ఫలితం అని అన్నారు. మల్టీనేషనల్ కంపెనీలతో ఫైట్ చేసి నష్టపరిహారం చెల్లించేలా చూశాం అన్నారు. చాలా కష్టపడి పనిచేశారని కలెక్టర్ దివాకర టి.ఎస్.ని అభినందిచారు. ఐదారు కంపెనీల వారందరిని ఒప్పించి నష్టపరిహారం చెల్లించేలా చేశామని, సీడ్ రైతులు కంపెనీలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమతులు ఉన్న కంపెనీలతోనే ఒప్పందాలు చేసుకుని కలిసి పనిచేయాలని అన్నారు. నష్టపోయి ఏ ఒక్క రైతు సూసైడ్ చేసుకోవద్దనీ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక స్కీమ్ లు తెస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ, భరోసా, సన్నాలకు బోనస్ లాంటివి తెచ్చిందని అన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దనీ రైతులని మోసం చేసి ఆర్గనైజర్లు బాగా సంపాదించుకున్నారని తెలిపారు. రైతులను మోసం చేసే ఆర్గనైజర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం అని అన్నారు. ఆర్గనైజర్లు రైతులకు డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రాసుకున్నారని, అలాంటి దందాలు ఇక మానుకోండి లేదంటే బాగోదనీ హెచ్చరించారు. ఇది ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, మంత్రి తుమ్మలకు ఈ ప్రాంతం పై పూర్తి అవగాహన ఉందని, ఇక్కడ ఆయన చాలా అభివృద్ధి పనులు చేశారనీ కొనియాడారు. ట్రైబల్ ఎమ్మెల్యేలంతా సీఎం ను కలిసి మా ప్రాంతంలో అదనంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరితే అదనంగా మంజూరు చేశారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయం, రైతు సంక్షేమ కమిటీ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి మాట్లాడుతూ విత్తనం పై రైతుకు హక్కు ఉంటుందని దానిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న వెన్నుముక లాంటి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం అదనంగా నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. పలు మండలాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి నిపుణుల కమిటీ నియమించి దేశంలోనే మొదటిసారిగా నష్టపరిహారం చెల్లించడం జరిగిందని, విత్తనాలకు బండగారం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతుల సంక్షేమ కమిషన్ సభ్యులు మరికాంతి భవాణి, రాములు నాయక్, రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, కె.వి. నర్సింహా రెడ్డి, మాజి ఎంఎల్సి బాల సాని లక్ష్మీనారాయణ, ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, అదనపు ఎస్ పి సదానందం, ఆర్డీఓ వెంకటేష్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.